తిరుపతి (ఆగస్టు 11): గత వైకాపా ప్రభుత్వంలో ఉపాధి లేక యువత తీవ్రంగా నష్టపోయారని, నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ‘ఉద్యోగాల జాతర’కు శ్రీకారం చుట్టిందని తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని, త్వరలోనే మరొక డీఎస్సీ కూడా విడుదల చేస్తామని తెలిపారు. ‘తల్లికి వందనం’ ద్వారా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.8,000 కోట్లకు పైగా కేటాయించామని, బడుల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, పౌష్టికాహార భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ భరోసా’ కింద పింఛన్ రూ.4,000కు పెంచి 60 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని, రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అమరావతిలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్’, ‘క్వాంటం వ్యాలీ’లను ఏర్పాటు చేస్తున్నామని, 2029 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్న వైకాపా నేతలకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే, వారికున్న 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల బరిలో నిలవాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు అన్నా అనిత, సురేంద్ర నాయుడు, విజయకుమార్, పుష్పవతి, రేవతి, చెంగయ్య యాదవ్, రూపేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

