వింజామూరు, జూలై 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

వింజమూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల కోసం విడుదలైన కోట్ల రూపాయల నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్‌తో పాటు అప్పటి పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 కోట్లకు పైగా నిధుల లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, వాటిలో సుమారు రూ.1.54 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అభివృద్ధి పనులు పూర్తికాకపోయినా బిల్లులు చెల్లించడం, రికార్డుల్లో వ్యత్యాసాలు ఉండటం వంటి అంశాలు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు సంబంధిత రికార్డులు, వౌచర్లు, ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే విచారణ వేగంగా సాగడం లేదని, అధికార పక్ష నేతల ఒత్తిళ్ల కారణంగా చర్యలు ఆలస్యం అవుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని తిరిగి రాబట్టాలని గ్రామస్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఆరోపణలపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *