హరితవనం పెంపు, రక్షణ గోడల నిర్మాణంపై పల్లా ప్రత్యేక సూచనలు..అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి..టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నo, జూలై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..

విశాఖపట్నం పారిశ్రామిక నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణతో పాటు కాలుష్య నియంత్రణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాన పరిశ్రమల సమీక్ష సమావేశంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, విశాఖలోని 18 ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ పోర్టు పరిసర ప్రాంతాల నుంచి బొగ్గు ధూళి, పారిశ్రామిక కాలుష్యంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సమావేశంలో సవివరంగా చర్చించామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన బాధ్యతగా ప్రతి సంస్థ భావించాలని స్పష్టం చేశారు.కేవలం తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారాల దిశగా పరిశ్రమలు అడుగులు వేయాలని పల్లా సూచించారు. బొగ్గు నిల్వలపై టార్పాలిన్లు కప్పడం ఒక్కటే పరిష్కారం కాదని, తరచూ వాటిని తొలగించడం, మళ్లీ కప్పడం వల్ల అవి దెబ్బతినడంతో ఆశించిన ఫలితం ఉండదని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అందుకే ప్రతి పరిశ్రమ తన విస్తీర్ణానికి అనుగుణంగా విస్తృతంగా హరితవనాలను అభివృద్ధి చేయడంతో పాటు, కనీసం 20 అడుగుల ఎత్తులో రక్షణ గోడలు నిర్మించి దుమ్ము, బొగ్గు కణాలు బయటకు వ్యాపించకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు.బొగ్గు రవాణాలోనూ నిబంధనలు కచ్చితంగా అమలు కావాల్సిన అవసరం ఉందని పల్లా అన్నారు. లారీలు గరిష్ఠ లోడ్ సామర్థ్యానికి మించి బొగ్గు తరలించరాదని, అధిక లోడింగ్ వల్ల రోడ్లపై బొగ్గు చెల్లాచెదురై కాలుష్యంతో పాటు ప్రమాదాలకు కూడా కారణమవుతోందన్నారు. ప్రతి వాహనంపై తప్పనిసరిగా గ్రీన్ టార్పాలిన్ కప్పి రవాణా చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.కాలుష్య నియంత్రణ విషయంలో పరిశ్రమలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, ఉపాధి కల్పన ఎంత ముఖ్యమో, స్వచ్ఛమైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.సమావేశంలో అధికారులు పరిశ్రమల ప్రతినిధులకు కాలుష్య నియంత్రణకు సంబంధించిన పలు మార్గదర్శకాలు జారీ చేయగా, వాటిని నిర్దిష్ట గడువులో అమలు చేయాలని ఆదేశించారు. విశాఖను పారిశ్రామికంగా అగ్రగామిగా తీర్చిదిద్దడంతో పాటు కాలుష్యరహిత నగరంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *