తిరుపతి, జూన్ 07:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పిఎసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో యోగా ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా ప్రతి ఇంటికీ చేరువవుతోందని పేర్కొన్నారు.
యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి మార్గదర్శకమని, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నేటి యువత యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని డా. హరిప్రసాద్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు, యోగా శిక్షకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


