రేణిగుంట:
మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్విని ఆదేశాల మేరకు ఒడ్డిమిట్ట, వేణుగోపాలపురం గ్రామాల్లో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, హెచ్ఈఓ బాబు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ టైఫాయిడ్పై అవగాహన కల్పించారు. ఇటీవల ఊరి గంగమ్మ జాతర జరిగిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలుషిత నీరు, కలుషిత ఐస్, బహిరంగ మలమూత్ర విసర్జన మరియు మూతలు లేని రోడ్డు పక్కన ఆహారాల వల్ల టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుందన్నారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి ఈ వ్యాధి లక్షణాలన్నారు. ప్రజలు నీటిని కాచి చల్లార్చి తాగాలని, చేతులను సబ్బుతో కడుక్కోవాలని, తాజాగా వండిన ఆహారమే తినాలని సూచించారు.
వ్యాధి సోకిన వారు గంజి, కిచిడీ, కొబ్బరినీరు లాంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, కారాలు, మసాలాలు మానాలన్నారు. టైఫాయిడ్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, అక్కడ పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు రేవతి, లోహిత, ఆశా కార్యకర్తలు విమల, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.

