రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఇది సువర్ణావకాశం…అధికారులు –నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచన..!

కలిగిరి ఏప్రిల్ 6, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు

కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలో చెరువు వద్ద నిర్వహించిన “నీటి భద్రత – నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులు, అధికారులు, నాయకులతో కలిసి చెరువు పరిస్థితులను పరిశీలించి, నీటి నిర్వహణపై సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులను కేంద్రబిందువుగా ఉంచుకుని “రైతు ప్రభుత్వం”గా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం 149 చెరువులకు 149 మంది నీటి సంఘ అధ్యక్షులను నియమించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ అధ్యక్షుల ఆధ్వర్యంలో చెరువుల మరమ్మత్తులు, పూడికతీత పనులు సమర్థవంతంగా చేపట్టబడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన 100 రోజుల గడువులో ఈ పనులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల అధ్యక్షులు అందరూ సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమస్యాత్మక చెరువులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి, సమయానికి పూర్తి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని అన్నారు. చెరువులను కేవలం నీటి నిల్వ కేంద్రాలుగానే కాకుండా, గ్రామాల అభివృద్ధికి మూలాధారంగా మార్చాలని పిలుపునిచ్చారు.అనంతరం తూర్పు గుడ్లదొన, పడమర గుడ్లదొన మరియు ఎరుకులరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ఉమ్మడి చెరువు కట్ట విస్తరణ పనులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించి, టెంకాయ కొట్టి శుభారంభం చేశారు. ఈ కార్యక్రమన్ని కలిగిరి మoడల అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు ఆధర్వంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *