వరికుంటపాడు, మన న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె).
షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహణ.
వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, చర్చి పాస్టర్లు ఎమ్మెల్యే ని పూలమాలలతో, శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ,క్రిస్మస్ పండుగ అనేది శాంతి, ప్రేమ, కరుణ, దయ వంటి మానవీయ విలువలను ప్రపంచానికి చాటిచెప్పే మహత్తర వేడుక అని అన్నారు. ఇటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించే సాధనమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన క్యాలెండర్లను ఆవిష్కరించి, చర్చి పాస్టర్లకు నూతన వస్త్రాలను బహుమతిగా అందజేశారు. కూటమి ప్రభుత్వం పాస్టర్ల సేవలను గుర్తించి నెలకు రూ. 5,000 గౌరవ వేతనం అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇది ప్రభుత్వానికి అన్ని మతాల పట్ల ఉన్న సమాన గౌరవానికి నిదర్శనమని అన్నారు. గ్రామాలలో నివసించే ప్రజలంతా మతభేదాలు మరిచి సర్వమత సౌభ్రాతృత్వంతో అన్ని పండుగలను కలిసి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.సమైక్యతే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.అదేవిధంగా, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో ని అన్నిచర్చిలకు స్వీట్లు తినుబండారాలను,అందజేస్తున్నామని,ఈ,సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వాటిని అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, క్రైస్తవ సంఘ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
