
తిరుపతి, అక్టోబర్ 31: రాబోయే ఖరీఫ్ 2026–27 సీజన్లో ధాన్యం సేకరణ కార్యకలాపాలను సమర్థవంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని రైస్ మిల్లర్లు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సూచించారు.
శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణకు సంబంధించిన ముందస్తు సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైస్ మిల్లర్లు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.
ధాన్యం సేకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, గోదాములలో నిల్వ సామర్థ్యం, ధాన్యం దిగుమతి, బియ్యం నిల్వ తదితర అంశాలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైస్ మిల్లర్లు సహకరించాలని పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ( డీఎస్ఓ ), జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ( డిసి ఎస్ ఎం ), తిరుపతి, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
