​మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఒక నిందితుడికి తిరుపతి స్పెషల్ జేఎస్సీఎం కోర్టు 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రేణిగుంట మండలం, పద్మా నగర్‌‌కు చెందిన బుజ్జిపల్లి రామాంజనేయులు (45) గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ కేసును తిరుపతి స్పెషల్ జేఎస్సీఎం కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మోటార్ వెహికల్స్ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ, అక్టోబర్ 05 నుండి అక్టోబర్ 25 వరకు 21 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట రూరల్ సర్కిల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో గాజులమండ్యం ఎస్సై హరీష మరియు సిబ్బంది రోడ్డు భద్రతపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
​ఈ సందర్భంగా సిఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమే కాకుండా, డ్రైవర్ల ప్రాణాలతో పాటు రహదారిపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు అని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *