• బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారుల సంయుక్త పరిశీలన.
  • క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక.
  • కమాండ్ కంట్రోల్, సబ్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ.
  • తిరుమలలో పరిమిత పార్కింగ్ దృష్ట్యా ప్రైవేట్, ఎల్లో బోర్డు వాహనాల నియంత్రణకు చర్యలు.
  • భక్తులు ఆర్టీసీ ప్రజారవాణా సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి.
  • 2,800కు పైగా కెమెరాలతో తిరుమలలో నిరంతర నిఘా.

తిరుమల, సెప్టెంబర్ 04:
శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ సీవీ &యస్..ఓ మురళీకృష్ణ, ఐపీఎస్., వారు సంయుక్తంగా పరిశీలించారు. తిరుమలలోని రింగ్ రోడ్డు, కీలక ట్రాఫిక్ జంక్షన్లు, భక్తుల రాకపోకల మార్గాలు తదితర ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పరిధిలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్‌లు, సబ్ కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

తిరుమలలో పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో సుమారు 2,500 నుంచి 3,000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ అవకాశం ఉందని తెలిపారు. స్థానికులు, టీటీడీ సిబ్బంది, అధికారులు మరియు ఇతర వాహనాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌ను పద్ధతిగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ప్రైవేట్, ఎల్లో బోర్డు వాహనాలను అక్కడే నిలిపేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

తిరుపతిలో వాహనాలను నిలిపే భక్తులు అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకుని, దర్శనం అనంతరం తిరిగి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. భక్తులు పోలీసు, టీటీడీ యాజమాన్యానికి సహకరించి ప్రజారవాణా సేవలను వినియోగించుకోవాలని కోరారు.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ వాహనాల రాకపోకలకు ఎక్కడి వరకు అనుమతి ఉంటుంది, ఎప్పటి నుంచి పరిమితులు విధిస్తారు అనే అంశాలపై త్వరలో ప్రత్యేకంగా పూర్తి వివరాలను మీడియా ద్వారా వెల్లడిస్తామని ఎస్పీ గారు తెలిపారు. పోలీసు, టీటీడీ అధికారులు ఇచ్చే సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

టీటీడీ సి.వి& ఎస్ ఓ మురళి కృష్ణ , ఐపీఎస్., మాట్లాడుతూ..శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ మరియు ఇంజనీరింగ్ విభాగాల సమన్వయంతో భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భక్తుల క్యూలైన్ల నిర్వహణపై సమీక్షిస్తున్నామని చెప్పారు.

తిరుమల వ్యాప్తంగా ప్రస్తుతం 2,800కు పైగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి, ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటెడ్ అనలిటిక్స్ ద్వారా రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రెజర్ పాయింట్లను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

తిరుమలలో పార్కింగ్ పరిమితంగా ఉన్నందున భక్తులు తమ సొంత వాహనాల కంటే ఆర్టీసీ, ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కోరారు. టీటీడీ పాలకమండలి చైర్మన్, ఈవో సూచనల మేరకు భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీసుల సహాయ సహకారాలతో అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సంయుక్త పరిశీలనలో తిరుమల ఆదనపు ఎస్పి ఐ రామకృష్ణ మరియు తిరుపతి జిల్లా పోలీసు అధికారులు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *