రేణిగుంట సెప్టెంబర్ 04 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అన్నాస్వామిపల్లి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళ గ్రామంలో బస చేసిన అధికారులు, స్థానిక ప్రజలతో నేరుగా ముఖాముఖి సమావేశమై గ్రామంలోని పలు సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాజకీయ విద్వేషాలకు తావులేకుండా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, మద్యం లేదా ఇతర ప్రలోభాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా యువత గొడవలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న వివాదాలు ఉంటే స్థానికంగానే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

