అమరజీవి ఆశయ సాధన దిశగా తొలిఅడుగు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం కాసారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది మాజీ మంత్రివర్యులు, అమరజీవి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దశాబ్దాల కలా, ఆశయమని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
ఆ నాడు ఆయన కనిపెంచిన కల ఈరోజు శ్రీకాళహస్తి ప్రజల ఆశీస్సులతో, మనందరి సమక్షంలో సాకారమవుతుండడం తనకు అత్యంత సంతోషాన్ని, వర్ణించలేని ఆత్మీయ తృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు.
రైతాంగానికి లో-వోల్టేజ్ సమస్యల నుండి శాశ్వత విముక్తి:
ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం ద్వారా తొట్టంబేడు మండల పరిధిలోని అనేక గ్రామాలకు విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మరియు అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే ధ్యేయంగా ఈ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన, అత్యంత వేగవంతంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యలు పూర్తిగా తొలగిపోయి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సమర్థవంతంగా విద్యుత్ సరఫరా జరిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని స్పష్టం చేశారు.
ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిరంతర శ్రమ:
తన తండ్రిగారు వేసిన ప్రజాసేవా మార్గంలోనే అడుగులు వేస్తూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు.
పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనాలు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే పరమావధిగా నిరంతరం శ్రమిస్తానని ఈ వేదికగా ఆయన పునరుద్ఘాటించారు.
భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, సముద్రంలా కదిలిన గ్రామీణులు:
అత్యంత వైభవంగా జరిగిన ఈ భూమిపూజ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజాప్రతినిధులు,కూటమి కుటుంబ సభ్యులు,ప్రముఖ నాయకులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మరియు కాసారం గ్రామ ప్రజలు,పరిసర ప్రాంత రైతాంగం భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మహోత్సవంగా విజయవంతం చేశారు.

