రేణిగుంట (ఆగష్టు 13): రేణిగుంటలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు, పరమ శివభక్తురాలు, మహారాణి రాణి అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఎమ్‌ఎస్ జిల్లా కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ.. మహమ్మదీయుల పాలనలో ధ్వంసమైన హిందూ సంస్కృతి, ధర్మం మరియు చరిత్రను పునర్నిర్మించడంలో అహల్యాబాయి హోల్కర్ అందించిన సేవలు అసమానమని, ఇండోర్, మహేశ్వర్, ద్వారక, ఉజ్జయిని, కాశి, వైద్యనాథ్, అయోధ్య, రామేశ్వరం, హరిద్వార్, సోమనాథ్ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఆలయాల పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా మధ్య భారత దేశంలో అనేక చెరువులు, కాలువలు తవ్వించి ప్రజా సంక్షేమానికి పాటుపడటమే కాక, మహిళలకు అనేక విద్యలు నేర్పించి ప్రత్యేక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసిన ధీర వనిత అని గుర్తుచేశారు. భారత ప్రభుత్వం ఆమె పేరిట ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించడంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టడం హర్షణీయమని పేర్కొంటూ, ఆమె అందించిన మహత్తర సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, వార్డు సభ్యులు ఎం.జి. రాజేష్ రెడ్డి, హాస్టల్ వార్డెన్ శీను మరియు ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాణి అహల్యాబాయి హోల్కర్ ధైర్యసాహసాలు మరియు సేవలను వివరిస్తూ ఘన నివాళులు అర్పించారు.


