రేణిగుంట జూలై 5.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు సూచనలతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
యర్రమరెడ్డి పాల్యం మార్గంలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో గాజులమండ్యం ఎస్.ఐ ఎస్. హరీష, పోలీస్ సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టామని సి.ఐ వివరించారు. ఆ సమయంలో బొలెరో మాక్స్, బజాజ్ ఆటో, స్ప్లెండర్ బైక్‌పై బియ్యం లోడ్‌తో వస్తూ, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన ఎం. శివానందం (46), కె. ప్రేమ కుమార్ (31), ఎం. సంతోష్ (20)లను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని విలేజ్ రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించగా, అవి రేషన్ బియ్యంగా ధృవీకరించబడిందని సి.ఐ పేర్కొన్నారు. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కొని, ఎక్కువ రేట్లకు విక్రయించేందుకు వీటిని తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశామని, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సి.ఐ మంజునాథ రెడ్డి స్పష్టం చేశారు.
