

మనన్యూస్:బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మంజూరు చేయాలి…
నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం…
తిరుపతి, రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం కలసి విన్నవించారు. మంగళవారం అమరావతిలో మంత్రి సవితను రుద్రకోటి సదాశివం కలసి నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం నిధులను కేటాయించాలని అభ్యర్థించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు నిర్వహించుకుంటున్న బార్బర్ షాప్ లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జీవోను వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా వెంటనే చొరవ చూపాలన్నారు. అలాగే అన్ని జిల్లాల్లో నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. నాయి బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గతంలో ప్రభుత్వం జారీచేసిన 13 14 జీవోల ప్రకారం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ గదులను నాయి బ్రాహ్మణులకు కేటాయించాలన్నారు. జీవో నెంబర్ 26 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో బార్బర్ పోస్టులను పోలీస్ శాఖలో బ్యాండ్ పార్టీ విభాగంలో అర్హులైన నాయి బ్రాహ్మణులకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలు పైబడిన నాయి బ్రాహ్మణులకు నెలకు 5000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వాలని ఇల్లులేని నిరుపేద నాయి బ్రాహ్మణులకు ఇంటి స్థలం కేటాయించాలని మంత్రిని కోరామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చినట్లు రుద్రకోటి సదాశివం మీడియాకు వెల్లడించారు. అంతకుముందు మంత్రి సవితను శాలువతో ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
