నిజాంసాగర్, నవంబర్ 23 ( మన ధ్యాస ): ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.అయితే మొహమ్మద్‌నగర్ మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైర్హాజరు కనిపించింది.మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 10:40 గంటలైనా ఏ శాఖకు చెందిన అధికారి హాజరుకాలేదు. కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరై ఉన్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు, గ్రామస్థులు వస్తే వారి వినతులు స్వీకరించి సమస్యలపై స్పందించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం.ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరించడంతో పాటు తహసీల్దార్, వ్యవసాయ, విద్య, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకావాల్సి ఉంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికే అధికారులు హాజరుకాకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.