​రేణిగుంట: గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల (2026) నేపథ్యంలో రేణిగుంట మండలంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ చురుకుగా సాగుతోందని డిప్యూటీ ఎంపీడీవో ప్రభురావు తెలిపారు. మండలంలోని మొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను మధ్యాహ్నం 3:00 గంటల సమయానికి అందిన అధికారిక నివేదిక ప్రకారం, సర్పంచ్ పదవులకు 21, వార్డు సభ్యుల స్థానాలకు 43 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు.

​జీపాలెంలో అత్యధిక సర్పంచ్ నామినేషన్లు

డిప్యూటీ ఎంపీడీవో ప్రభురావు అందించిన వివరాల ప్రకారం, మండలంలోనే అత్యధికంగా జీపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఏకంగా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కరకంబాడి, మామండూరు, సూరప్పకాసం, వెంకటాపురం, తండ్లెం పంచాయతీల్లో రెండేసి చొప్పున సర్పంచ్ నామినేషన్లు అందాయి. ఆతురు, గురవరాజూపల్లె, ఆర్.మల్లవరం, రేణిగుంట, తుకివాకం, విప్పమనుపట్టెడ గ్రామాల్లో ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. మరోవైపు గాజులమండ్యం, గుత్తివారిపల్లె, వేదళ్ళచెరువు, కృష్ణాపురం, ఎస్.యు.పురం, కొట్రమంగళం పంచాయతీల్లో మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

​వార్డు స్థానాలకు పోటాపోటీ

వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఆర్.మల్లవరంలో అత్యధికంగా 10 నామినేషన్లు దాఖలయ్యాయని ప్రభురావు పేర్కొన్నారు. మామండూరులో 8, ఏలమండ్యంలో 7, రేణిగుంటలో 6 నామినేషన్లు అందాయి. జీపాలెం, తండ్లెం, విప్పమనుపట్టెడ పంచాయతీల్లో మూడేసి చొప్పున, వెంకటాపురంలో 2, గురవరాజూపల్లెలో 1 నామినేషన్ దాఖలయ్యాయి.

​సమయాల వారీగా నామినేషన్ల సరళి

ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సర్పంచ్ స్థానాలకు 8, వార్డు స్థానాలకు 15 నామినేషన్లు రాగా; మధ్యాహ్నం 12:00 నుండి 3:00 గంటల మధ్య నామినేషన్ల దాఖలు మరింత ఊపందుకుని సర్పంచ్‌కు 13, వార్డులకు 28 నామినేషన్లు నమోదైనట్లు డిప్యూటీ ఎంపీడీవో ప్రభురావు వివరించారు. సాయంత్రం 3:00 నుండి 5:00 గంటల మధ్య నామినేషన్ల తుది వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *