ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ రైట్స్ అండ్ యు -బెంగళూరు వారి సహకారంతో రేణిగుంట మండలం అన్నాస్వామి పల్లిలో జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్
కె.నారాయణ మాట్లాడుతూ ఏ దేశానికైనా బాలలే తరగని సంపద. అందుకే వారి రక్షణ, సంరక్షణ, ఆయా ప్రభుత్వాల బాధ్యత, కర్తవ్యం కూడా. వారు బాల్యం నుంచే సంపూర్ణంగా ఎదగాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలి. ఆ విధంగా ఉండేలా మన రాజ్యాంగంలో అనేక చట్టాలు రూపొందించారు అని వివరించారు. నవంబర్ 14 న జాతీయ బాలల దినోత్సవం రోజున మొదలై నవంబర్ 20 వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం వరకు ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో సార్వత్రిక బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేసారు.

రేణిగుంట మండల కో ఆర్డినేటర్ జయలక్ష్మి మాట్లాడుతూ హక్కులు పెద్దవారికే కాదు, బాలలకు కూడా వర్తిస్తాయి. బాలల సంపూర్ణ వికాసానికి అభివృద్ధికి అండగా నిలబడతామని, బాలల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడతామని ‘అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక యు.ఎన్.సి.ఆర్.సి పేర్కొంది. దీని ప్రకారం అమ్మ కడుపులో ఉన్న శిశువు నుంచి 18 ఏళ్లలోపు వారందరూ బాలలే అని తీర్మానించింది. ఆ విధంగా 1959 లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులను ప్రకటించింది. 1989 నవంబరు 20న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘బాలల హక్కుల ఒడంబడిక’ పై అప్పట్లో 180 దేశాలు సంతకం చేశాయి. నవంబరు 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత ప్రభుత్వం ఎన్నో చర్చోపచర్చల తరువాత 1992 డిసెంబరు 11న సంతకం చేసి వీటి అమలుకు ఎన్నో చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలుకు కృషి చేస్తోంది. ఆ విధంగా యు.ఎన్.సి.ఆర్.సి కి అన్ని దేశాల ఆమోదం పొందిన ఏకైక తీర్మానం ‘యు.ఎన్.సి.ఆర్.సి’ అని చెప్పవచ్చు. బాలల హక్కులను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చేందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. ఒడంబడికలో పేర్కొన్న అంశాల్లో ఇప్పటి వరకు మార్పేమీ లేదు. అలాగే ఫలాన తేదీలోగా ఒడంబడిక అంశాలను అమలు చేయాలని నిబంధన కూడా లేదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా పేర్కొనాలి. ఈ సమస్యలను ఎదుర్కొనడంలోను, పరిష్కారం పొందడంలోను సరైన మార్గదర్శనం అవసరం అన్నారు. కమ్యూనిటీ ఆర్గనైజర్ సురేష్ మాట్లాడుతూ కొత్త కొత్త సమస్యలతో బాలల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. హక్కులు పరిరక్షించుకోవడం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలి. ఉప శమనం పొందే విధంగా ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యత వహించాలి. స్నేహ పూర్వక సమాజంలో మాత్రమే ఇది సాధ్యం, జాతి, జాతీయత, వర్ణ, మత, భాష, స్త్రీ, పురుష, సాంస్కృతిక భేదం లేకుండా ప్రపంచ బాలలందరికి ఈ హక్కు చెందాలన్నది బాలల హక్కుల అంతర్జాతీయ మహా సభ ఉద్దేశం అని తెలియజేసారు. అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ‘నేటి బాలలే నేటి పౌరులు’ కాబట్టి ఆ దిశగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసారు. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది. బాలల దినోత్సవం సందర్బంగా ప్రగతి సంస్థ తరపున బాలల సంగం సభ్యులకు స్కిప్పింగ్ రోప్స్, క్రికెట్ బంతులు, రింగులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *