- రాష్ట్రంలో విద్యార్థినులకే రక్షణ లేకపోవడం అత్యంత ఆందోళనకరం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
గాజువాక మన ద్యాస ప్రతినిధి నవంబర్ 1:రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై తరగతి గదిలోనే చైన్సాతో దాడి జరిగిన ఘటనను బి.సి.వై పార్టీ కో-కన్వీనర్ అంజూరి దీపక్ తీవ్రంగా ఖండించారు.విద్యను అభ్యసించాల్సిన పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై ఇలాంటి దాడి జరగడం అత్యంత బాధాకరమని,సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు వారికి సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యతను కూడా కలిగి ఉంటాయని, అలాంటి విద్యాసంస్థలోకి ఓ దుండగుడు ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడటం పాఠశాల భద్రతా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. విద్యార్థినుల ప్రాణాలకు, భద్రతకు భరోసా కల్పించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని,చంద్రబాబు పాలనలో విద్యార్థినులు సైతం భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి రావడం విచారకరమని అంజూర దీపక్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులు,రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.ప్రభుత్వ పాఠశాలలోనే ఇంతటి దారుణ ఘటన చోటుచేసుకోవడం వెనుక భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉన్న లోపాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించి మరో విద్యార్థిని కూడా గాయపడటం మరింత బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రాణభయంతో ఉండాల్సిన పరిస్థితులు రావడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.ఈ ఘటనను ప్రభుత్వం సాధారణ నేరంగా పరిగణించకుండా అత్యంత ప్రాధాన్యతతో స్పందించాలని అంజూర దీపక్ కోరారు. గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యసేవలను తక్షణమే అందించి,వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు.బాధిత కుటుంబాలకు ఆర్థిక, వైద్యపరమైన భరోసా కల్పించడంతో పాటు వారి పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి,ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని,నేరం రుజువైన పక్షంలో చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా ఏర్పాట్లను తక్షణమే సమీక్షించాలని, పాఠశాలల్లోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాఠశాలల్లోనే పిల్లలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడితే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు ఎలా పంపించాలని అంజూర దీపక్ ప్రశ్నించారు.రాప్తాడు ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబానికి బి.సి.వై పార్టీ కో-కన్వీనర్ అంజూర దీపక్ డిమాండ్ చేశారు.