• తిరుపతి కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
  • ప్రశాంతమైన, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన పోలీస్ భద్రత.
  • డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.
  • సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, రూట్ మొబైల్స్‌, స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర పర్యవేక్షణ.
  • 39వ వార్డులో కిడ్నాప్ పేరుతో తప్పుడు ప్రచారం చేసిన ఘటనపై ఎంసీసీ ఉల్లంఘన కింద కేసు నమోదు.
  • అసత్య ప్రచారాలు, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు.

తిరుపతి, అక్టోబర్ 31: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఈరోజు తిరుపతి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.

ఎన్నికల భద్రతలో భాగంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూట్ మొబైల్స్‌, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను అందుబాటులో ఉంచారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అదనపు ఎస్పీ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ , ఎన్నికల సమయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 39వ వార్డుకు సంబంధించి భర్త కిడ్నాప్ అయ్యాడంటూ ఉదయాన్నే ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి వివరాలు సేకరించగా, సదరు వ్యక్తి స్వయంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లినట్లు వెల్లడైందని, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. నాయకులే స్వయంగా ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి హాజరుపరిచారని వివరించారు. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించిన చర్యలపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ ) ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభావితం చేయడం, బెదిరించడం లేదా ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నిర్ధారణ లేని సమాచారాన్ని, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు.

ప్రజలకు లేదా ఓటర్లకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని, సమస్యల పరిష్కారానికి పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *