*వింజమూరు, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.*

వింజమూరు మండల పరిధిలోని కీలక కూడలి అయిన *బంగ్లా సెంటర్* వద్ద ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు సీరియస్ అయ్యారు. జాతీయ రహదారి పక్కన అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడం, హైవే స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడంపై *వింజమూరు ఎస్‌ఐ శ్రీ ఉమా మహేశ్వరరావు గారు* కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు గారు మాట్లాడుతూ.. బంగ్లా సెంటర్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమని, ఇక్కడ ప్రతిరోజూ వందలాది వాహనాలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. అయితే కొంతమంది వాహనదారులు రోడ్డు పక్కన ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేయడం, అలాగే కొంతమంది వ్యాపారులు హైవేకు చెందిన స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ఒకరి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తం:*
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బంగ్లా సెంటర్ లో ప్రజల రద్దీ మరింత పెరిగిందని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.ఇకపై జాతీయ రహదారి పక్కన అక్రమ పార్కింగ్ చేసినా, హైవే స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగించినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆక్రమణలు వెంటనే తొలగించుకోవాలని, లేనిపక్షంలో జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *