రేణిగుంట: రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కె . కృష్ణవేణి ఆధ్వర్యంలో రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో పోషణ్ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ మరియు అంగన్‌వాడీ ఉత్సవ్ – సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ కె . కృష్ణవేణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవాలని, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు వయస్సు మరియు అవసరాలకు అనుగుణంగా సమతుల ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, పోషణ్ ట్రాకింగ్, జన ఆందోళన్, సమతుల ఆహారం మరియు పోషకాహారం వంటి అంశాలపై గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, కిషోర బాలికలు మరియు పిల్లలకు అవగాహన కల్పించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు మరియు కిషోర బాలికలకు అందించాల్సిన వివిధ రకాల పోషకాహారం గురించి వివరించారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలు, వివిధ రకాల పోషకాహార పదార్థాల వినియోగం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా 3–5 సంవత్సరాల పిల్లల్లో శారీరక, మానసిక, భాషా, మేధో మరియు సృజనాత్మక అభివృద్ధికి అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అంగన్‌వాడీ కార్యకర్తను సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీమతి హేమవతి, అనంతలక్ష్మి, రేణిగుంట మరియు ఏర్పేడు మండలం అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *