చిత్తూరు, ఆగస్టు 30 – మన ద్యాస (అనంత కుమార్ )
చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్థానిక విజయం డిగ్రీ కళాశాలలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జానపద మాసోత్సవ ముగింపు కార్యక్రమం, తెలుగు భాషా దినోత్సవ సమావేశం ఘనంగా జరిగింది. మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, రచయితలు, గాయని గాయకులు, కళాకారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్థసారథి నాయుడు, నారాయణస్వామి, త్యాగరాజు నాయుడు, మనోహర్, కలకట రెడ్డప్ప, శ్రీరంజని తదితరులు హాజరయ్యారు. మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణస్వామి మాట్లాడుతూ జానపద పాటలు పల్లె జీవన విధానాన్ని, గ్రామీణ జీవనశైలిని, ప్రజల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. జానపద గేయాలు మన సాంఘిక, సాంస్కృతిక, సంప్రదాయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలని పేర్కొన్నారు.ఆధునిక కాలంలో జానపద కళలు, పాటలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, అలాంటి పరిస్థితుల్లో మన జానపద కళా సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నారాయణస్వామి అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు జానపద కళల గొప్పతనాన్ని పరిచయం చేయడం ద్వారా వాటిపై ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప మాట్లాడుతూ ఆగస్టు 1న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపంలో పలువురు గాయని గాయకుల భాగస్వామ్యంతో ప్రపంచ జానపద మాసోత్సవ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఉమ్మడి తిరుపతి–చిత్తూరు జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జానపద కళలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు.కాణిపాకం, ఐరాల, వడమాలపేట, పాకాల, చంద్రగిరి, కల్వకూరు, పుల్లూరు, తిరుపతి, చిత్తూరు, చావటకుంట, ఏర్పేడు, ఎస్.వి. యూనివర్సిటీ, వెంకటగిరి, నాయుడుపేట, తిరుచానూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, వైకుంఠపురం, గాజులమండలం, తెల్లకూరు, పి.సి.ఆర్. కళాశాల, వెదురుకుప్పం, రేణిగుంట, కోడూరు, పుత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాల్లో మొత్తం 26 వేదికలపై జానపద కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో జానపద పాటల ప్రాముఖ్యత, జానపద కళల విశిష్టతపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు రెడ్డప్ప వెల్లడించారు. ఆగస్టు 1న ప్రారంభమైన జానపద మాసోత్సవాలను ఆగస్టు 30న విజయవంతంగా ముగించడం ఆనందంగా ఉందన్నారు.జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులు, రచయితలు, కళాకారులను సంప్రదాయబద్ధంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. జానపద కళలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన సంస్కృతి కళా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు వక్తలు అభినందించారు.ఈ కార్యక్రమంలో షాజహాన్ భాష, పాడిపాటి రమేష్, రాధ, లత, మునస్వామి, సోమశేఖర్, శంకర్ అప్పాజీ, గ్రేడ్స్ శేషాద్రి, అనంత కుమార్, దివ్యలత, ఉమాదేవి, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప ఆచారి తదితర రచయితలు, గాయని గాయకులు, కళాకారులు పాల్గొన్నారు.జానపద కళలను పరిరక్షిస్తూ, తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.