తిరుపతి (ఆగష్టు 11): శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భక్తులను, నిరుద్యోగులను నమ్మించి దాదాపు రూ. 10 లక్షల వరకు మోసగించిన టీటీడీ సస్పెండెడ్ క్లాస్-4 ఉద్యోగి జలకర గిరిధర్ (34)ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన ఇతను, తాను టీటీడీలో ‘పేష్కార్’గా పనిచేస్తున్నానని, తన టీటీడీ ఐడీ కార్డు ప్రతిని పంపి భక్తులను బురిడీ కొట్టించేవాడు. ఈ క్రమంలో ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి వద్ద శ్రీవారి సేవా టికెట్ల కోసం రూ. 1,56,000, తిరుపతికి చెందిన మరో వ్యక్తి వద్ద ఉద్యోగం పేరుతో రూ. 3,60,000 ఫోన్‌పే ద్వారా వసూలు చేసి, ఆపై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, నేరం అంగీకరించడంతో కోర్టు అతనికి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శ్రీవారి దర్శనం, సేవా టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని, దళారులకు నగదు చెల్లించి మోసపోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ హెచ్చరించారు.
