ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు.

ఏర్పేడు ఆగష్టు 7.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం
చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం నుండి గుల్ల కండ్రిగలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ ఇరుగులింగేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానంగా నూతన రోడ్డు మార్గాన్ని శుభ్రపరిచి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చిన ‘శివం టు శివం’ స్ఫూర్తితో గుడిమల్లం ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇరుగులింగేశ్వర స్వామి ఆలయ దివ్యత్వాన్ని, మహిమను అందరికీ చాటిచెప్పాలనే సంకల్పంతో గిరినాయుడు ముందడుగు వేసి, ఈ రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
భక్తుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం:
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు మాట్లాడుతూ.. గుడిమల్లం దర్శనానికి వచ్చే భక్తులందరూ ఇరుగులింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలనే ఉద్దేశంతోనే ఈ దారిని ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పండుగల సమయంలో గుడిమల్లం వచ్చే భక్తుల రద్దీ వల్ల వాహనదారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఈ నూతన మార్గంతో ట్రాఫిక్ సమస్యలకు పెద్ద ఉపశమనం కలుగుతుందని వివరించారు. రానున్న రోజుల్లో ఈ దారిని మరింత విస్తరించి, మౌలిక వసతులు కల్పించి పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆలయ భూములు, గోవుల సంరక్షణకు ప్రాధాన్యత:
ఇరుగులింగేశ్వర ఆలయ పరిధిలో ఉపయోగం లేకుండా ఉన్న ఖాళీ భూములను సద్వినియోగం చేయడంతో పాటు, ఆలయ ఆధీనంలో ఉన్న గోవులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు కోరిక మేరకు వాటిని గుడిమల్లం ఆలయం ద్వారా దత్తత తీసుకుని సంరక్షించేందుకు చైర్మన్ గిరినాయుడు చొరవ చూపారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుల్ల కండ్రిగ పంచాయతీ రెడ్డిగుంట ఎస్టీ కాలనీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మనాథం నాయుడు, సుధాకర్ నాయుడు, సురేష్ నాయుడు, సి. మోహన్, ముదిరాజ్ సుధాకర్, వెంకటరమణ, మారయ్య, కిష్టయ్య, పావనితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని గిరినాయుడి కృషిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *