శ్రీకాళహస్తి ఆగష్టు 1.
​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన ఈ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రారంభం కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
​గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడితే “అక్కడ ఎర్రబస్సు కూడా రాదు” అని హేళన చేసిన వైకాపా నాయకులు, ఈరోజు అదే భోగాపురంలో ‘ఎయిర్ బస్సు’ ల్యాండ్ అవ్వడాన్ని చూసి తలదించుకోవాలని ఎమ్మెల్యే విమర్శించారు. 2014-19 టీడీపీ హయాంలోనే ఈ విమానాశ్రయానికి పునాదులు వేసి, అన్ని అనుమతులు తెచ్చింది చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. వైకాపా నాయకులకు ఇతరులు చేసిన అభివృద్ధి పనులకు క్రెడిట్ తీసుకోవడం అలవాటుగా మారిందని, ఆనాడు వెక్కిరించిన వారే నేడు తామే చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
​ఈ ప్రారంభోత్సవ వేళ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి గొప్ప గౌరవం దక్కిందని బొజ్జల సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ కళంకారి కళాకారుడు ‘రమేష్’ అద్భుతమైన కళంకారి డిజైన్లను భోగాపురం విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా ప్రదర్శించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ప్రయాణికులు శ్రీకాళహస్తి కళా వైభవాన్ని తిలకించేలా గొప్ప వేదిక లభించిందన్నారు.
​కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభోత్సవానికి తీసుకువచ్చిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా ముందుకు సాగుతున్నాయని చెబుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *