రేణిగుంటలో బిడ్డ తల్లులకు అవగాహన..
తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారం..హెల్త్ సూపర్వైజర్ కామరాజు…
రేణిగుంట ఆగష్టు 1:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు రేణిగుంటలోని పాంచాలి నగర్ 14వ వీధి అంగన్వాడీ కేంద్రంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ (ఆగస్టు 1 నుండి 7 వరకు) ఘనంగా ప్రారంభమయ్యాయి. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ( ఐ సి డి ఎస్ ) మరియు రాష్ట్రీయ సేవా సమితి (రాస్ – తిరుపతి) అనుబంధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ, బిడ్డకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తల్లిపాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ఇచ్చే పచ్చటి ముర్రు పాలు శిశువుకు తొలి టీకా వంటివని, ఇవి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే బిడ్డ పుట్టిన నాటి నుండి ఆరు నెలల వరకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, దీనివల్ల బిడ్డ శారీరక మరియు మానసిక ఎదుగుదల చాలా బాగుంటుందని చెప్పారు.తల్లిపాలలో బిడ్డకు అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, పాలు పట్టడం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆయన వివరించారు. ప్రతి తల్లి మూఢనమ్మకాలను వీడి పసిపాపలకు క్రమం తప్పకుండా తల్లిపాలు అందించి వారిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది మరియు స్థానిక తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


