శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: హెచ్చరించిన రేణిగుంట పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణలో రేణిగుంట పోలీసుల కఠిన చర్యలు: డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జయచంద్ర, మంజునాథ రెడ్డిలకు అభినందనలు
రేణిగుంటలో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన రౌడీషీటర్ సేతు దిలీప్ కుమార్ అలియాస్ తంబిని రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు రేణిగుంట తహసీల్దార్ ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గతంలో నమోదైన కేసుల నేపథ్యంలో శాంతియుత ప్రవర్తన కోసం రౌడీషీటర్ సేతు దిలీప్ కుమార్ అలియాస్ తంబిని పోలీసులు తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. అయితే, ఆ నిబంధనలను పక్కనబెట్టి ఈ నెల 06-07-2026న తారకరామ నగర్‌లో జరిగిన ఒక గొడవ కేసులో ఇతను మరోసారి ప్రమేయం కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలో ఆధారాలతో సహా నిజాలు వెల్లడయ్యాయి. బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మళ్లీ గొడవలకు దిగడంతో పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక చొరవ చూపి, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరిస్తున్న రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జయచంద్ర, మంజునాథ రెడ్డిలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
