రేణిగుంట (07-10-2026):
ప్రమాదం చెప్పి రాదని, తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా విద్యుత్ ప్రమాదాల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట రూరల్, అర్బన్ విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్ష కాలంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు పలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ శాఖ సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు:
- స్తంభాలు, తీగలు: వర్షానికి తడిసిన కరెంట్ స్తంభాలను, తెగిపడిన విద్యుత్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను లేదా కొమ్మలను తాకరాదు.
- గృహ ఉపకరణాలు: ఇంట్లోని స్విచ్ బోర్డులు, స్టార్టర్లు, మోటార్లు, వాటర్ హీటర్లు, ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తడి చేతులతో తాకకూడదు.
- ఉరుములు, మెరుపులు: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, డిష్ కనెక్షన్ల స్విచ్‌లను ఆఫ్ చేసి ప్లగ్‌లు తొలగించాలి. కరెంట్ లైన్ల కింద నిలబడి సెల్ఫోన్లు మాట్లాడరాదు.
- ఇంటి జాగ్రత్తలు: ఉతికిన బట్టలను ఇనుప తీగలపై ఆరేయకూడదు. బయట పెట్టిన విద్యుత్ లైట్లు నీటిలో తడవకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలను విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉంచాలి.
- పార్కులు, స్టేడియంలు: పార్కులు, స్టేడియంలలో ఉండే విద్యుత్ స్తంభాలు, తీగలను ముట్టుకోకూడదు.
ఈదురుగాలుల వల్ల విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు తగిలినా, ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్లు దెబ్బతిన్నా వెంటనే మీ పరిధిలోని జేఎల్ఎం , ఏఎల్ఎం , లైన్‌మన్ , సబ్‌స్టేషన్ లేదా ఏఈ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితిల్లో 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

