ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎం. జయకృష్ణ.
వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ పిలుపునిచ్చారు. నిమజ్జనం రోజు విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ ను శనివారం స్థానిక కచ్చపి ఆడిటోరియంలో ఎస్పి సుబ్బరాయుడు, కమిషనర్ ఎం.జయకృష్ణ, విద్యుత్ ఎస్.ఈ.చంద్రశేఖర్, నిమజ్జన కమిటీ కన్వినర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు కలసి ఆవిష్కరించారు. చవితి వేడుకల్లో నియామాలను ఉల్లగించకుండా భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహిద్దామని మండపాల నిర్వాహకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగరవాసులు అందరూ మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని తెలిపారు. నగరంలో మండప నిర్వాహకులు అందరూ సమన్వయం పాటించి భక్తి శ్రద్దలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. తాము రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం నిమజ్జనం కొరకు వినాయక సాగర్ కి విగ్రహాలు తీసుకు రావాలని తెలిపారు. మండప నిర్వాహకులు అందరూ నిమజ్జనం తేదీలను ముందుగానే తెలపాలని, ఆరోజే నిమజ్జనానికి రావాలని తెలిపారు. మద్యం సేవించడం వంటివి పూర్తిగా నిషేధం అని తెలిపారు. నిమజ్జనానికి మూడవ రోజు, ఏడరోజున సాగర్ లోను, ఆయా మార్గాల్లో అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని, భక్తులు, మండప నిర్వాహకులు చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, డి ఎస్పీలు భక్తవత్సలం, కొండయ్య, నిమజ్జన కమిటీ సభ్యులు ఆర్సి మునికృష్ణ, గుండాల గోపి, నవీన్ కుమార్ రెడ్డి, వరప్రసాద్, మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

