రేణిగుంటలో విషాదం..
రేణిగుంట అక్టోబర్ 11.
రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై రేణిగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే:
తిరుపతి జిల్లా, వెంకటగిరి మండలం, సిద్దవరం గ్రామానికి చెందిన పెయ్యాల గోవర్ధన్, సుబ్బలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు పెయ్యాల బద్రి (26). ఇతనికి సుమారు ఆరేళ్ల క్రితం కావమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి లోకేష్ వర్ధన్ (3) అనే కుమారుడు ఉన్నాడు. బద్రి తన కుటుంబంతో కలిసి రేణిగుంట మండలం, తారకరామ నగర్లో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు.
కొంతకాలంగా బద్రి మద్యానికి బానిసగా మారి, సరిగ్గా ఆటో నడపకుండా ఖాళీగా ఉంటూ భారీగా అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 09 వ తేదీ న భార్య కావమ్మ తన చెల్లెలి ఇంటికి వెళ్లడంతో బద్రి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.అక్టోబర్ 10(శనివారం) సాయంత్రం భార్యతో ఫోన్లో మాట్లాడిన బద్రి, ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్పందించలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఎదురింట్లో ఉండే మురళి అనే వ్యక్తికి సమాచారం ఇవ్వగా, అతను వెళ్లి చూసేసరికి ఇంటి లోపల సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బద్రి మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు.
మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది బద్రి ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పెయ్యాల సుబ్బలక్ష్మి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
