కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం: వామపక్ష నేతలు

​తిరుపతి:

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనకు దిగిన నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వామపక్షాల (సీపీఎం, సీపీఐ, ఎస్‌యూసీఐ-సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, ఎస్‌యూసీఐ(సీ) నగర కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాల్సింది పోయి, ఢిల్లీలో నిరసనకారులను అక్రమంగా నిర్బంధించడం దారుణమన్నారు.

​ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లకుండా మాజీ సీఎంలు, ప్రతిపక్ష ఎంపీలు, వామపక్ష నేతలను అరెస్టు చేయడం, వేలాది మంది పోలీసులను మోహరించి భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ప్రజల ఓటు హక్కు, నిరసన తెలిపే హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే నిర్బంధాలకు దిగడం దుర్మార్గమన్నారు.

​ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో కే. వేణుగోపాల్, జే. విశ్వనాథ్, పి. బుజ్జి, ఎన్.డి. రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *