రేణిగుంట:

తిరుపతి జిల్లా రేణిగుంట వద్ద చోటుచేసుకున్న రూ. 1.20 కోట్ల విలువైన కాపర్ వైర్ చోరీ కేసును రేణిగుంట అర్బన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా, చోరీకి గురైన మొత్తం సొత్తును రికవరీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బెంగళూరులోని వేదాంత లిమిటెడ్ – స్టార్‌లైట్ కాపర్ కంపెనీ నుంచి శ్రీసిటీకి దాదాపు 7 టన్నుల కాపర్ వైర్‌తో వెళ్తున్న లారీ (టీన్ 23 డీసీ 4177) మార్గమధ్యంలో చోరీకి గురైంది. ఎక్కువ మొత్తంలో లాభాలు సంపాదించాలనే దురాశతో లారీ డ్రైవర్ వినోద్ కుమార్, తన అనుచరుడు దినేష్‌తో కలిసి ఈ కుట్రకు తెరలేపాడు. రవాణాలో ఉన్న కాపర్ వైర్‌ను వేలూరు సమీపంలోని ఒక చెరువులో దాచిపెట్టి, లారీని రేణిగుంటలోని ఒక హోటల్ వద్ద వదిలేసి పరారయ్యారు.
​పక్కా ప్లాన్‌తో మాటువేసి పట్టుకున్న పోలీసులు:
కాపర్ వైర్ చోరీపై రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో సీఐ జయచంద్ర నేతృత్వంలో ఎస్సై శ్రీనివాసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది దర్యాప్తును వేగవంతం చేశారు.
​దాచిపెట్టిన కాపర్ వైర్‌ను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు దొరక్కపోవడంతో, రేణిగుంట వద్ద వదిలేసిన లారీని తీసుకెళ్లేందుకు తమిళనాడుకు చెందిన ఆర్. రాజా (35), కె. నవీన్ కుమార్ (39) వచ్చారు. అప్పటికే నిఘా ఉంచిన పోలీసులు వారిని మాటువేసి పట్టుకున్నారు.
​సొత్తు రికవరీ – మిగతా నిందితుల కోసం గాలింపు:
అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వేలూరు సమీపంలోని చెరువులో దాచిపెట్టిన రూ. 1.20 కోట్ల విలువైన 7 టన్నుల కాపర్ వైర్‌తో పాటు లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన లారీ డ్రైవర్ వినోద్ కుమార్, దినేష్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
​పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు:
కేసును అత్యంత ప్రతిభావంతంగా, వేగంగా ఛేదించిన సీఐ జయచంద్ర, ఎస్ఐ శ్రీనివాసులుతో పాటు పోలీస్ సిబ్బంది మురళి, రమేష్, చలపతి, రాజశేఖర్, బాబుష, శ్రీను, గౌరి నాయుడు, హేమంత్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద దృశ్యాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *