జలదంకి, అక్టోబర్ 6 (మన న్యూస్, నాగరాజు)


పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, గర్భిణీలు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని జలదంకి మండలం ఎల్.ఆర్ అగ్రహారం కొత్తూరు ఎస్సీ అంగన్వాడి కేంద్రం టీచర్ మజున సూచించారు.సోమవారం మండల పరిధిలోని ఎల్.ఆర్ అగ్రహారం అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ పద్మజాకుమారి ఆదేశాల మేరకు పోషణ మాసోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి గర్భిణీ, బాలింత తప్పనిసరిగా ప్రభుత్వం అందిస్తున్న ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. చిన్న పిల్లలకు బలవర్థకమైన ఆహారం అందించడం ద్వారా వారిలో రక్తహీనత, ఎదుగుదల లోపాలను అధిగమించవచ్చని సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టికాహార పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న గుడ్లు, పాలు, బాలామృతం వంటి వాటిని పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని తల్లులకు అవగాహన కల్పించారు.అనంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *