కలిగిరి సెప్టెంబర్ 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ కాలనీలలో వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆయా కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.పెద్దకొండూరు గ్రామ పంచాయతీ వాస్తవ్యులు, పవిత్ర విద్యా సంస్థల చైర్మన్ శ్రీ యేండ్లూరి వెంకటేష్ చౌదరి గారు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించారు. వివిధ కాలనీలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు, మండపాల అలంకరణకు, అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును ఆయన స్వయంగా అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యేండ్లూరి వెంకటేష్ చౌదరి వివిధ వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… వినాయకచవితి అంటే కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది ప్రజలందరినీ ఏకం చేసే సామాజిక ఉత్సవమని అన్నారు. గ్రామంలోని అన్ని కాలనీల ప్రజలు కులమతాలకు అతీతంగా కలిసి ఈ ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తనదైన శైలిలో మాట్లాడుతూ, పెద్దకొండూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, విద్యా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తాను నిరంతరం తోడ్పాటు అందిస్తానని స్పష్టం చేశారు.వినాయకుని ఆశీస్సులతో గ్రామంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్దకొండూరు గ్రామ పంచాయతీ ప్రజలు, వివిధ కాలనీల ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు యేండ్లూరి వెంకటేష్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా గ్రామమంతా భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *