రేణిగుంట, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గాజులమండ్యం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమండ్యం చెరువులో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
ప్రజలు, భక్తులు, ఉత్సవ నిర్వాహకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ పీ ఎస్ పి డి సి ఎల్ అధికారుల సహకారంతో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
నిమజ్జన ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు
ఈ సందర్భంగా సోమవారం రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్సై హరీష మరియు పోలీసు సిబ్బంది ఎల్లమండ్యం చెరువును పరిశీలించి, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిమజ్జన ప్రదేశంలో భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జేసీబీ సహాయంతో ముళ్లకంపలు, ఇతర అడ్డంకులను తొలగించారు. రాత్రి వేళల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశంలో భద్రతా చర్యలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉత్సవ నిర్వాహకులకు పోలీసుల విజ్ఞప్తి
ఈ సందర్భంగా సీఐ మంజునాథరెడ్డి మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రతి వినాయక విగ్రహం నిమజ్జనం చేసే సమయం, ఊరేగింపు వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలి.పోలీసులు సూచించిన సమయం, మార్గం మరియు నిమజ్జన ప్రదేశాన్ని మాత్రమే వినియోగించాలి.ఊరేగింపులో క్రమశిక్షణ పాటిస్తూ, ట్రాఫిక్‌కు మరియు ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.నిమజ్జన ప్రదేశంలో పోలీసుల సూచనలు పాటించి, పిల్లలు, వృద్ధులు మరియు మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా ముగిసేలా ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యం – అందరి సహకారంతో ప్రశాంతమైన వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేద్దాం.

