మన ధ్యాస ,నిజాంసాగర్‌, ( జుక్కల్ ) సెప్టెంబర్‌ 10, నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్‌చంద్ర, ఐపీఎస్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో స్వయంగా మాట్లాడి విధుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.ప్రతిరోజూ నిర్వహించే రోల్‌కాల్‌లో సిబ్బందికి విధుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు ఇస్తున్నారా అని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ఇస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందికి సక్రమంగా చేరుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించారు. రోల్‌కాల్‌ను క్రమబద్ధంగా నిర్వహిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సూచనలు అందించాలని ఆదేశించారు.అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసులు, CCTNS పనితీరు, స్టేషన్‌ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెండింగ్‌, లాంగ్‌ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
బీట్‌ సిస్టమ్‌, పెట్రోలింగ్‌ పటిష్టం చేయాలి
నేరాల నియంత్రణలో భాగంగా బీట్‌ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామంపై నిరంతర నిఘా ఉంచుతూ, బీట్‌ సిబ్బంది ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలపై అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌కాల్స్‌ ద్వారా జరిగే మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.


గణేష్‌ నవరాత్రులకు ముందస్తు భద్రతా చర్యలు
రానున్న గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. గణేష్‌ మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిమజ్జనం, ట్రాఫిక్‌, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సమన్వయంతో పనిచేసి మెరుగైన పోలీస్‌ సేవలు అందించాలని ఎస్పీ రాజేష్‌చంద్ర సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్‌ ఎస్‌ఐ శివకుమార్‌,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *