రేణిగుంట సెప్టెంబర్ 10. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజుల మండ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ పోషణ మాసం – 2026, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యం మరియు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని హెల్త్ సూపర్వైజర్ కామరాజు తమ ఆరోగ్య సిబ్బందితో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా కామరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక,మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు,పాలు, గుడ్లు,పండ్లు వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.పరిశుభ్రమైన తాగునీరు,వ్యక్తిగత పరిశుభ్రత,చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ మలమూత్ర విసర్జన మాని మరుగుదొడ్డి వాడటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని తెలిపారు.అదేవిధంగా చదువు,పరీక్షలు,కుటుంబ పరిస్థితులు తదితర కారణాలతో ఒత్తిడికి గురైనప్పుడు సమస్యలను మనసులో దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలని సూచించారు.ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని,ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని విద్యార్థులకు వివరించారు. నిరాశ,ఆందోళన లేదా ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు అవసరమైన సహాయాన్ని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు,వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి పొందాలని సూచించారు. ఆత్మహత్యల నివారణకు “మాట్లాడుదాం.. విందాం.. తోడుగా నిలుద్దాం.. జీవితాన్ని కాపాడుకుందాం” అనే సందేశంతో విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై మనోధైర్యం నిండేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ , ఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది సుభాషిణి, తేజ, చాముండేశ్వరి,విద్యార్థులు పాల్గొన్నారు.

