రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అర్బన్ పరిధిలోని వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కరకంబాడి గ్రామ పంచాయతీ చెరువు మరియు వెంకటాపురం చెరువు ప్రాంగణాలను రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర , రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులతో సంయుక్తంగా సందర్శించి క్షేత్రస్థాయి స్థల పరిశీలన నిర్వహించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సీఐ జయచంద్ర తో పాటు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు లు మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు కరకంబాడి మరియు వెంకటాపురం చెరువుల వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో స్థలం చదునుగా ఉందో లేదో తనిఖీ చేసి, వాహనాల రాకపోకలకు మరియు భక్తుల సంచారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రాత్రి వేళల్లో నిమజ్జనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు చెరువుల వద్ద తగినంత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చెరువులలో నీటి లోతును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదకరమైన లోతైన ప్రాంతాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు మరియు సురక్షిత సరిహద్దులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ జయచంద్ర తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ మరియు పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన ప్రక్రియను విజయవంతం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూస్తామని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *