​ రేణిగుంట జులై 5. తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ రవి మనోహర్ ఆచారి, రేణిగుంట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై. శ్రీనివాసరావుల ఆదేశాలు మరియు సూచనల మేరకు, రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో గాజులమండ్యం పోలీసులు ఈ విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించారు. జిల్లాలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా, వినాయకపురం, యర్రమరెడ్డిపాళెం డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో సిఐ మంజునాథ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ హరీష మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇంద్రజిత్ రామ్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకుని, నిందితుడి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచి నుండి ఒకటిన్నర కిలోల కంటే ఎక్కువ బరువున్న గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలంలో స్థిరపడి గంజాయి విక్రయిస్తున్న సదరు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిఐ మంజునాథ రెడ్డి తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ మంజునాథరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ హరీష మరియు పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *