రాజకీయాలు యువతను పడుచేస్తున్నాయి కాదంటారా బహుజనులు రాజ్యమేలుతామంటే ఒప్పుకుంటారా
ఎన్నికల్లో గెలిచేది అధిక కులస్తుల నాయకులే.. గొడవల్లో నలిగిపోయేది అమాయక యువతే అధికులు దళితులే
క్షణిక ఆవేశంలో నేరాల్లో చిక్కుకుంటే ఉద్యోగాలు, ఉజ్వల భవిష్యత్తు నాశనం
అంబేద్కర్ ఆశయాలతో విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలి రాజ్యమేలాలి .
బైబిల్ ప్రకారం మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, పదవుల వ్యామోహం కోసం యువత తమ విలువైన భవిష్యత్తును బలిచేసుకోవద్దని ప్రముఖ సామాజిక వేత్త, దైవజనులు రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ యువతకు హితవు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలిచి అధికారం అనుభవించేది బలమున్న నాయకులేనని, కానీ వారి కోసం ఎన్నికల గొడవల్లో పాల్గొంటే జీవితాంతం కోర్టులు, క్రిమినల్ కేసులతో నలిగిపోయేది అమాయక యువతేనని గుర్తుచేశారు. అధికారం కేవలం ఐదేళ్లే ఉంటుందని, కానీ ఒకసారి క్రిమినల్ కేసులు పడితే ఆ కష్టాలు కుటుంబాలను జీవితాంతం వెంటాడుతాయని స్పష్టం చేశారు.
డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకూడదు
డబ్బు, మద్యం వంటి తాత్కాలిక ప్రలోభాలు చూపి ప్రత్యర్థులపై దాడులకు ఉసిగొల్పే రాజకీయ కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. “నేడు చేతిలో డబ్బు పెట్టి గొడవకు పంపేవారు.. రేపు చేతులకు బేడీలు పడితే కాపాడటానికి రారు. వెయ్యి రూపాయల తాత్కాలిక ప్రలోభానికి లొంగి, రేపు కోర్టుల చుట్టూ లక్షల రూపాయలు వృథా చేసుకోకండి” అని యువతను హెచ్చరించారు.
కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి:
ఎన్నికల గొడవల్లోకి దిగే ముందు ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ రాక కోసం ఎదురుచూసే వృద్ధ తల్లిదండ్రులు, భార్యాబిడ్డల ముఖాలను గుర్తుచేసుకోవాలని కోరారు. “మీరు జైలుపాలైతే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? రెచ్చగొట్టిన నాయకులు మీ పిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకుంటారా? ఒక్క యువకుడు ఉన్నత చదువులతో రాణిస్తే కుటుంబం తరిస్తుంది.. అదే కేసుల్లో చిక్కుకుంటే కుటుంబం రోడ్డున పడుతుంది” అని పేర్కొన్నారు.
దళితుల ఐక్యతను కాపాడుకోవాలి:
ఎన్నికల వేళ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే గ్రామీణ కుటుంబాల మధ్య రాజకీయాల పేరుతో విభేదాలు సృష్టించడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దళితుడిని మరో దళితుడిపై రెచ్చగొట్టి, గ్రామాల్లో కక్షలు పెంచే కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
చేతుల్లో ఉండాల్సింది ఆయుధాలు కాదు.. పుస్తకాలు:
యువత చేతుల్లో ఉండాల్సింది రాళ్ళు, కర్రలు, ఆయుధాలు కావని; పుస్తకాలు, కలం, ఉన్నతమైన ఆశయాలని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాల బాటలో నడిచి విద్యావంతులై, సంఘటితమై, ఆర్థికాభివృద్ధి సాధించడమే యువత ధ్యేయం కావాలన్నారు. దళితుల ఐక్యతే అసలైన బలమని, ఉన్నత విద్యే తిరుగులేని ఆయుధమని, శాంతియుత జీవనమే నిజమైన విజయమని ఉద్ఘాటించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:
రాజకీయాల్లో చైతన్యవంతంగా ఓటు వేయడం వేరు, స్వార్థపరుల కోసం చట్టవిరుద్ధ హింసకు పాల్పడడం వేరని తెలిపారు. ఎవరికీ రాజకీయ పావులుగా మారకూడదని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా రెచ్చగొట్టినా, హింసకు పురికొల్పినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా తక్షణమే ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలే తప్ప, నాయకుల స్వార్థం కోసం ఎవరూ నేరస్థులుగా మారవద్దని రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్ ఈ ప్రకటన ద్వారా యువతకు పిలుపునిచ్చారు.
