
17 కేసులు నమోదు – రూ.60,000 జరిమానా
ఆటో యూనియన్ నాయకులతో అవగాహన సమావేశం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతికి వచ్చే భక్తులు, ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆటోలు, సుమోలు, జీపులపై రెండవ రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ప్రత్యేక తనిఖీల్లో అధిక చార్జీల వసూలు, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, పర్మిట్ తదితర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 17 కేసులు నమోదు చేసి రూ.60,000/- జరిమానా విధించారు.
ఆటో యూనియన్ నాయకులతో అవగాహన సమావేశం
తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ నాయకులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్ణయించిన ఆటో చార్జీలను మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని, అధిక చార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో తిరుపతి నగరానికి మంచి పేరు వచ్చేలా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భక్తులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రవాణా శాఖకు సహకరించాలని యూనియన్ నాయకులను అధికారులు కోరారు.
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని, రవాణా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి తిరుపతి కొర్రపాటి మురళీమోహన్, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పురుషోత్తం, ఎంవీఐ శ్రీనివాసరావు, అతికా నాజ్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.