కలిగిరి మండలానికి రాష్ట్రస్థాయి గుర్తింపు*
కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
పారిశుధ్య నిర్వహణలో కలిగిరి మండలం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోనే కలిగిరి మండలం మొదటి స్థానం కైవసం చేసుకుంది.పొడి చెత్త అనగా ఇనుము, ప్లాస్టిక్ తదితర వ్యర్థ వస్తువులను ప్రజల వద్ద నుండి సేకరించి, వారికి బదులుగా నిత్యావసర సరుకులు అందించే విధానం ద్వారా ఈ ఘనత సాధించారు. నెలకు సుమారు రూ.1 లక్ష పైబడి ఆదాయం ఆర్జిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఆగస్టు నెల వరకు సుమారు రూ.7 లక్షలకు పైగా టర్నోవర్ సాధించారు.ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బొమ్మరాజు చెరువుకు చెందిన మాలకొండయ్యను ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
*చెత్త నుండి సంపద తయారీలో 9వ ర్యాంకు…*
అదేవిధంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో వర్మీ కంపోస్ట్ తయారీకి ఇచ్చిన ర్యాంకులలో కలిగిరి మండలం రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. తయారైన వర్మీ కంపోస్ట్‌ను త్వరలో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు విక్రయించనున్నారు.మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 22 చోట్ల వర్మీ షెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 6000 కిలోల వర్మీ కంపోస్ట్ అందుబాటులో ఉంది. కిలో రూ.10 చొప్పున నిమ్మ, మామిడి, కూరగాయలు పండించే రైతులకు విక్రయించగా ఇప్పటి వరకు రూ.48,811 విలువైన వర్మీని పంచాయతీలు విక్రయించాయి.తడి చెత్తను గ్రీన్ అంబాసిడర్ల ద్వారా సేకరించి, వర్మీ కంపోస్ట్ తయారు చేయించి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేసిన పంచాయతీ అభివృద్ధి అధికారులను ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు.
