నెల్లూరు, సెప్టెంబర్ 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాజ్యాంగ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా అమలు చేయాలని కోరుతూ వివిధ సామాజిక, కుల సంఘాల ప్రతినిధులు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. హిందూ మతాన్ని ఆచరించే అర్హులైన వారికి నిబంధనల ప్రకారం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు.అనంతరం వచ్చిన రాజ్యాంగ సవరణల ప్రకారం బౌద్ధులు, సిక్కులకు సంబంధించిన నిబంధనలను కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో బీసీ (సి) కేటగిరీ కింద 1 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. రాజ్యాంగం, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీలకు చెందిన అర్చక స్వాములు, ఎస్సీ–ఎస్టీ కుల సంఘాల నాయకులతో పాటు ప్రాంత సంస్కృతి ప్రముఖ్ కోట సునీల్ కుమార్, నెల్లూరు విభాగ్ సంఘచాలక్ రామదండు, సామాజిక సమరసత ప్రతినిధులు పోలయ్య, కేశవ, జిల్లా కన్వీనర్ రమణయ్య, సహ కన్వీనర్ దాసరి రమేష్, బాలవికాశం కేంద్రం కన్వీనర్ మారుతీశ్వరరావు, నగర కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జోన్ ధర్మ ప్రచారక్ వెంగల్ రెడ్డి, నెల్లూరు జిల్లా ధర్మ ప్రచారక్ కె భాస్కర్, రాపూరు మండల సహ కన్వీనర్ సునీతమ్మ తదితరులు పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాకు చెందిన 8 మంది ఖండ ధర్మ ప్రచారక్‌లు, ఒక విస్తారక్ కూడా కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *