
రాష్ట్ర స్థాయి గత్కా పోటీల్లో మెరిసిన రేణిగుంట విద్యార్థులు
విజయవాడలోని విజ్ఞాన విహార్ స్కూల్లో ఈ నెల 13, 14 తేదీలలో రాష్ట్ర గత్కా సంఘం ఆధ్వర్యంలో “5వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గత్కా ఛాంపియన్షిప్ – 2026” పోటీలను నిర్వహించారు. భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన గత్కా పోటీలలో జిల్లా నుంచి మొత్తం 26 మంది బాలు బాలికలు పాల్గొనగా, రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాల నుండి 9 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీలలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె . విశ్వనాథ్ ఒక వెండి, ఒక కాంస్య (కంచు) పతకం సాధించి పాఠశాలకు ఖ్యాతి తెచ్చాడు. కాగా విశ్వనాథ్ గతంలో ఒడిస్సాలో జరిగిన జాతీయ స్థాయి రూరల్ గేమ్స్‌లో కూడా పాల్గొనడం విశేషం. అలాగే డి . ప్రవీణ్ కుమార్ ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించగా; బి . మనోహర్, పి . సుమంత్ వెండి పతకాలు గెలుచుకున్నారు. వీటితో పాటు వి . నవీన్ కుమార్, కె . బీరప్ప, యమ్ . ధనూష్, పి . వెంకటేష్ మరియు S. సలీమ్ కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు.
విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి .పి . శంకరి మేడమ్ స్వయంగా పతకాలు బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు డా. పి . ప్రభాకర్ రావు సార్, శకుంతల మేడమ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

