

Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రం ప్యాకేజీ ఇది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం 11 రాత్రులు/12 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52. విజయవాడ నుంచి బయలుదేరే ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌కు ఖమ్మం, ఖాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందెడ్, పూర్ణ స్టేషన్లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. ఈ ప్యాకేజీలో ఉజ్జయిని- మహా కాళేశ్వర్, ఓంకారేశ్వర దేవస్థానాలను దర్శించుకోవచ్చు. ద్వారకాలో నాగేశ్వరుడు, సోమ్‌నాథ్‌లో సోమనాథేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయవచ్చు. అలాగే- పుణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వరుడి ఆలయాలను భక్తులు సందర్శించవచ్చు. ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వరుడి దర్శనంతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ విజయవాడకు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్. ఆయా ఆలయాలన్నీ కూడా జ్యోతిర్లింగ క్షేత్రాలే. అందుకే దీనికి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీ టూర్‌గా పేరు పెట్టింది ఐఆర్సీటీసీ. ఈ ప్యాకేజీ టూర్ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 20,890 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 19,555 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు 33,735, పిల్లలకు 32,160 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు 44,375, పిల్లలకు 42,485 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
