

మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :– తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయల చెరువు రోడ్డులోని అన్నమయ్య కూడలి సమీపంలో 3.60 ఎకరాల్లో తుడా టవర్స్ ను 345 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి చేస్థామని అన్నారు. 245 రెసిడెన్షియల్ ప్లాట్స్ తో పాటు కమర్షియల్ ప్లాట్స్ ను అధునాతన సాంకేతికతో నిర్మిస్తున్నామని అన్నారు. నాణ్యమైన మెటీరియల్ ను వినియోగిస్తున్నామని అన్నారు. తుడా టవర్స్ ప్లాట్స్ వేలం ఈ నెల 8వ తేది ప్రారంభమై 12 వ తేది తో ముగుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరిన్ని టవర్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ ప్లాట్స్ కోసం చేస్తున్న వేలానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రజలు వీక్షించేందుకు వీలుగా మోడల్ ప్లాట్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునిక్రిష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్లు శ్యాంసుందర్, కృష్ణారెడ్డి, ఈ.ఈ.రవీంద్ర, డి.ఈ.రాజు, తదితరులు ఉన్నారు.
