

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మానవ జీవితంలో మహిళ పాత్ర వెలకట్టలేనిదని, మహిళలు మానవాళికి దిక్సూచి అని తెలియజేశారు.ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మితా రామనాధన్ మాట్లాడుతూ…నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేంతవరకు కృషి పట్టుదలతో పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని తెలియజేశారు. అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ జె.రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు భాగస్వామ్యంతో సమాజంలో సంపద సృష్టించవచ్చని, ఇతర విషయాల పై దృష్టి సారించకుండా ఉన్నతంగా విద్యను అభ్యసించి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, పోషకాహార పదార్థాలు తీసుకోవడంతో పాటు పని ఒత్తిడి లేకుండా చూసుకుని కుటుంబానికి ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొల్పేందుకు కృషి చేయాలని గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. సరస్వతి సూచించారు. అనంతరం ప్యానల్ అడ్వకేట్ ఏ.దేవి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని, ముఖ్యంగా మహిళలు ఆత్మ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల నందు మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన పలు ఆటల పాటల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థినులు అతిధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
