

Mana News, శ్రీకాళహస్తి:- అగ్రవర్ణాల దురహంకార రాజకీయాలకు బలవుతూ, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని, వారిలో ఆత్మస్థైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిదని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని,ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ లో గాని తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడిందని, తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ యన్టీఆర్ తరువాత ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారని తెలిపారు. బలమైన కార్యకర్తల శక్తి తోనే తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తున్నదని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబం 1987 నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లోనే ఉన్నారని, తమ స్వార్ధ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గాని, ప్రజలను గానీ బొజ్జల కుటుంబం ఏనాడూ మోసం చేయలేదని, గత జగన్ రెడ్డి అరాచక పాలనకు ఎదురొడ్డి పోరాడిన నాయకుడు సుధీర్ రెడ్డి అని కొనియాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యస్సీవీ నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతున్నదని, సంక్షోభంలో ఉందని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి తాను ముందుకు వస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బాధ్యత కలిగిన ఒక శాసనసభ్యునిగా తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఓటేరు చెరువు భూముల వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ దృష్టికి తీసుకొచ్చి, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పైన పేర్కొన్న సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం తప్పు ఎలా అవుతుందో పెద్దలు యస్సీవీ నాయుడు చెప్పాలని కోరారు. సుధీర్ రెడ్డి కారణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదో నష్టం జరిగిపోయిందని యస్సీవీ నాయుడు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. యస్సీవీ నాయుడు 2004 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పుడు గాని, 2014 లో చేరి 2019 లో మరలా తిరిగి రాజీనామా చేసినప్పుడు గానీ తెలుగుదేశం పార్టీ కుంగిపోలేదు, నిబద్ధత,నిజాయితీ మరియు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల బలంతో, గోడకేసి కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగి వస్తుందో అలా తెలుగుదేశం పార్టీ పుంజుకొని, ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కావున,యస్సీవీ నాయుడు నాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ ఎదురు చూడాల్సిన లోటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లేదు అనే విషయాన్ని పెద్దలు తెలుసుకోవాలని హితవు పలికారు.
డబ్బు, దర్పం చూపించి రాజకీయాలు చేయాలని అనుకునే వారిని అటు తెలుగుదేశం పార్టీ గాని, ఇటు సుధీర్ రెడ్డి గాని దగ్గరకు రానీయరని, కష్టనష్టాలకు వెరవకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే వారిని అమితంగా అభిమానించి, గౌరవించడంలో సుధీర్ రెడ్డి ఎక్కడా తక్కువ చేయరని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ కర్మాగారం అని, ఎప్పటికప్పుడు కొత్త సభ్యులను అక్కున చేర్చుకొని ప్రజా అభీష్టం మేరకు ముందుకు వెళ్ళే ఒక గొప్ప ప్రజాస్వామ్య వేదిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, పద్మశాలి సాధికార సమితి తిరుపతి పార్లమెంటు నాయకుడు చింతగింజల సునీల్, బిసి విభాగం నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, కృష్ణమూర్తి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
