

Mana News :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలైన వేసవి కాలం ప్రారంభం కాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, శనివారం 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.కాగా, గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 39.9, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. గురువారం 7 మండలాల్లో తీవ్ర స్థాయిలో 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.తీవ్ర ఎండ, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు బయటికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని ప్రజలకు సూచించారు.
